“గురుద్వారాలో తాము ప్రదర్శన చేసేటపుడు యాజమాన్యం స్పీకర్లను ఎలా ఆపేసేదో మహిళలు నాతో చెప్పారు. వారి ఢోల్కీ (చేతులతో వాయించే డోలక్ వంటి వాయిద్యం)ని ఆవరణ వెలుపలే ఉంచేవారు,” అని 41 సంవత్సరాలుగా ఢిల్లీలో నివసిస్తున్న నరీందర్ కౌర్ చెప్పారు. ఈమె గురుదాస్‌పూర్ జిల్లాలోని కహ్‌నువాన్ నుండి ఢిల్లీకి వలస వచ్చారు.

63 ఏళ్ల నరీందర్ కొత్తఢిల్లీలో మంచి గుర్తింపు పొందిన కీర్తనియా (కీర్తనలు పాడేవారు). ఆమె సిక్కుల పవిత్ర గ్రంథం – గురు గ్రంథ్ సాహిబ్ నుండి కీర్తనలు పాడుతూ, సిక్కు మహిళలకు మతపరమైన సంగీతంలో శిక్షణ ఇస్తుంటారు. ఈ సంగీతాన్ని శబద్‌ కీర్తనలుగా పేర్కొంటారు. గురుద్వారాల్లోనూ, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ వీటిని పాడుతుంటారు.

తనకెంత నైపుణ్యం ఉన్నప్పటికీ, ఇతర సిక్కు మహిళలందరి మాదిరిగానే తాను కూడా సిక్కు ప్రార్థనా స్థలాల్లో తన సంగీత నైపుణ్యానికి గుర్తింపు పొందటంకోసం చాలా కష్టపడ్డానని కౌర్ చెప్పారు.

ఢిల్లీ సిక్కు గురుద్వారా నిర్వహణ సంఘం గురుద్వారాలలో గాయకులుగా, సహ సంగీత వాద్యకారులుగా, పవిత్రగ్రంథ ప్రవచనకారులుగా నియమింపబడిన వారి వివరాలను తమ 2022 సమాచార గ్రంథంలో పొందుపరిచింది. నరీందర్‌కు ఎంతో అనుభవం ఉన్నప్పటికీ, 62 మంది రాగీలు, దాదీలలో గాయకులుగా ఒక్క మహిళ పేరు కూడా ఈ జాబితాలో లేదు; కవుల నియామకంలో మాత్రం పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంది. ఉన్న 20 పదవులకుగానూ 8 పదవులు స్త్రీలకు దక్కాయి.

“ఢిల్లీలోని గురుద్వారాలలో ప్రదర్శనకు సంబంధించి ఏ విధులనూ నాకు కేటాయించక వచ్చే నెలతో సంవత్సరం అవుతుంది” అంటారు 2022 ప్రారంభంలో కవి గా నియమితులైన బీబీ రాజిందర్ కౌర్.

ఎడమ: కీర్తనలు పాడే పోటీలలో పాల్గొనేందుకు నరీందర్ కౌర్ మహిళల్ని సమీకరిస్తుంటారు. ఫోటో: హర్మన్ ఖురానా. కుడి: ఢిల్లీ ఫతే దివస్ సందర్భంగా తన జాతా లోని యితర సభ్యులతో కలసి ప్రదర్శన యిస్తోన్న నరీందర్ కౌర్. ఫోటో సౌజన్యం: నరీందర్ కౌర్

సిక్కు మత సంప్రదాయాలు, ప్రవర్తనా నియమావళిని సూచించే అధికారిక – సిఖ్ రెహత్ మర్యాద – లో అమృతధారులైన (బాప్తిస్మం పొందిన) ఏ సిక్కు అయినా లింగబేధం లేకుండా గురుద్వారాలో కీర్తనలు పాడవచ్చునని చెప్పారు. చారిత్రక గురుద్వారాలను నిర్వహిస్తోన్న శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (SGPC) కూడా మహిళలకు చోటు కల్పించింది. వీరి దిఖ్తత్ (హుకుం) పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, చంఢీగఢ్‌లలోని గురుద్వారాలన్నింటిలో చెల్లుబాటవుతుంది.

ఇంత శక్తివంతమైన తోడ్పాటు ఉన్నప్పటికీ, గురుద్వారాలలోని మతపరమైన కార్యకలాపాల్లో మహిళలకు ప్రవేశం ఉండాలన్న విషయాన్నిచాలామంది సిక్కులు అంగీకరించరు. అందువల్ల మహిళా గాయకులు ప్రేక్షకపాత్రకే పరిమితమవుతున్నారు.

లింగపరమైన ఈ బేధాన్ని వ్యతిరేకిస్తూ, “పాడటానికే అంకితమై, క్రమశిక్షణ కలిగి, సంగీత శిక్షణ పొందిన మహిళలు స్వర్ణదేవాలయ ఆవరణలోని (మిగతా) గురుద్వారాలలో కీర్తనలు పాడగలిగినప్పుడు స్వర్ణదేవాలయంలోని ప్రధాన మందిరంలో పాండేందుకు వారిని ఎందుకు అనుమతించరు?” అని అడుగుతారు జస్విందర్ కౌర్ అనే కీర్తన్‌కార్. 69 యేళ్ల వయసున్న ఈమె కొత్త ఢిల్లీలోని మాతా సుందరి కళాశాలలో గుర్మత్ సంగీతంలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు.సిక్కు మతమంత ప్రాచీనమైన సంప్రదాయ గుర్మత్ సంగీతంలో విద్యార్థులకు శిక్షణ యిస్తున్నారు.

సిక్కుల పరమపవిత్ర ప్రార్థనాస్థలమైన స్వర్ణదేవాలయం గర్భగుడిలో మహిళలు పాడరు. ఎస్‌జిపిసికి బీబీ జాగీర్ కౌర్ అధ్యక్షులుగా ఉన్నప్పుడు కూడా నాయకులు ఈ విషయంపై మౌనంగానే ఉన్నారు. 2004-05లో ఆమె ఈ అంశాన్ని లేవనెత్తి, కీర్తనలు పాడేందుకు మహిళల్ని ఆహ్వానించినట్టుగా చెబుతారు. అయితే తన వద్దకు వచ్చిన దరఖాస్తులలో ఏ ఒక్కటీ తగినంత ప్రమాణాలలో లేకపోవడంతో ఆ విషయం అంతటితో ముగిసిపోయినట్టుగా ఆమె చెప్పారు.

ఆమె యిలా చేయడాన్ని, సనాతన సిక్కు సెమినరీ అయిన దమ్‌దమీ తక్సల్ కూడా వ్యతిరేకించింది. పదవ సిక్కు గురువైన గురు గోవింద్ సింగ్ స్థాపించిన సెమినరీ యిది. సిక్కులకు ఒక ప్రవర్తనా నియమావళిని రూపొందించిన మొదటి గురువు కూడా ఈయనే. స్వర్ణదేవాలయంలో పాడేందుకు మహిళల్ని అనుమతించడమంటే గురువుల కాలంనుంచి పాటిస్తోన్న పురుషులు మాత్రమే పాడే సంప్రదాయాన్ని అగౌరవపరచడమేనని తక్సల్ నమ్ముతుంది.

అమృతధారులైన సిక్కు మహిళలకు కీర్తనలు పాడే హక్కు ప్రసాదిస్తూ 1940లో ఎస్‌జిపిసి తీసుకొన్న నిర్ణయం మొదలుకొని ఈ విషయంలో మార్పు తెచ్చేందుకు ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. ఈమధ్య కాలంలో అకల్ తఖ్త్ 1996లో జారీ చేసిన హుకమ్‌నామా (దిఖ్తత్)లో కూడా ఈ విషయం పునరుద్ఘాటించబడినప్పటికీ లింగబేధం మాత్రం కొనసాగుతూనే ఉంది.

స్వర్ణదేవాలయంలోని గర్భగుడిలో మహిళలు కీర్తనలు పాడేందుకు అనుమతించాలని అకల్ తఖ్త్ (టెంపోరల్ సిక్కుసంఘం)నూ, ఎస్‌జిపిసినీ కోరుతూ పంజాబ్ రాష్ట్ర శాసనసభ 2019 నవంబరులో ఒక తీర్మానం చేసింది. ఆ తీర్మానం ప్రవేశపెట్టకముందే మతపరమైన వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యంగా చాలామంది శాసనసభ్యులు ఈ తీర్మానాన్ని వ్యతిరేకించారు.


వివాహం కాకమునుపు సిమ్రన్ కౌర్, తన అక్కచెల్లెళ్లతో కలిసి హోషియార్ పూర్ జిల్లాలోని సొహెయిన్ గ్రామంలో గల గురు రవిదాస్‌జీ గురుద్వారాలో ఒక గంటపాటు కీర్తనలు పాడేవారు. 27 యేళ్ల వయసున్న ఈమె రోజూ స్థానిక సంత్ బాబా మీహన్ సింగ్ గురుద్వారాను సందర్శించేవారు. అక్కడ మహిళలు పాడటం అసాధారణంగా ఏమీ కనిపించేదికాదు. చిన్నగురుద్వారాలు ఎస్‌జిపిచికి అనుబంధంగా లేకపోవడం వల్ల వాటి నిర్వహణ, పనితీరుల్లో అంత కఠినత్వం ఉండదని భావిస్తారామె.

“గ్రామాల్లో ఎక్కువగా మహిళలే గురుద్వారాలను నిర్వహిస్తారు. పురుషులు సాధారణంగా ఉదయాన్నే పనులకు వెళ్లిపోతారు. గురుద్వారాను ఎవరైతే మొదట చేరుకుంటారో వారే అభ్యాసం మొదలుపెడతారు” అని గుర్తుచేస్తారు సిమ్రన్.

అన్ని గ్రామాల్లోనూ పరిస్థితి ఇలా ఉండకపోయినా హర్మన్ ప్రీత్ కౌర్ అనుభవాన్ని బట్టి చూస్తే పరిస్థితిలో మార్పువస్తున్నట్టు అర్థమవుతుంది. 19 యేళ్ల ఈ యువ కీర్తన్‌కార్, తరణ్ తారణ్ జిల్లాలోని పట్టికి చెందినవారు. స్థానిక బీబీ రజనీజీ గురుద్వారాలో మహిళలు పాడగా తానెప్పుడూ చూడలేదని చెబుతుందీమె. గురుద్వారాలో జరిగే బహిరంగ ప్రార్థనల్లో గురు గ్రంథ్ సాహిబ్‌ను చదివే ఆమె తండ్రి ఈమెకు కీర్తనలు పరిచయం చేశారు. ఇప్పుడీమె ప్రత్యేక సందర్భాలలో ప్రదర్శనలిస్తుంటుంది.

ఎడమ: 2006లో గురు రవిదాస్ జయంతి వేడుకల్లో తన కుమార్తెతో కలిసి కీర్తన పాడుతోన్న సిమ్రన్ కౌర్ పిన్ని. ఫోటో సౌజన్యం: జస్విందర్ కౌర్. కుడి: వివాహం తరువాత సిమ్రన్ కౌర్ కీర్తనల అభ్యసనం ఆగింది. అయితే దగ్గర్లోని గురుద్వారాలో తన అభ్యసన ప్రక్రియను తిరిగి మొదలుపెట్టాలని ఆమె చూస్తున్నారు. ఫొటో: జస్విందర్ కౌర్.

అక్కడికి వంద కిలోమీటర్ల దూరంలోని పఠాన్‌కోట్ నగరంలోని గురు సింగ్ సభ గురుద్వారాలో ప్రతి శనివారం కొన్ని గంటలపాటు మహిళలు కీర్తనలు పాడుతూ ప్రార్థనలు చేస్తారని దిల్బాగ్ సింగ్ (54) చెబుతారు. పండుగలప్పుడు పర్యటించి ప్రదర్శనలిచ్చే మహిళల సంగీత బృందాలు కూడా వారికి ఉన్నాయి.

సుఖ్‌దీప్ కౌర్ (25), పటియాలాలోని పంజాబి విశ్వవిద్యాలయం నుంచి సిక్కు అధ్యయనాలు మరియు మత అధ్యయనాలలో రెండు మాస్టర్ డిగ్రీ పట్టాలు పొందింది. సంగ్రూర్ జిల్లా లసోయి గ్రామంలో నివసించే ఈమె, లింగపరమైన అధికార పరంపరకు పురుషుల్ని నిందించడం సరికాదని అంటుంది. గురుద్వారాలలో పూర్తిస్థాయి పదవులు నిర్వహించడం మహిళలకు కష్టమవుతుందని, మహిళలు “ప్రార్థనా గీతాలు పాడటం కంటే యింటినీ పిల్లల్నీ చూసుకుంటారు,” అని వాదిస్తుందీమె.

మహిళలు వీటన్నిటినీ సంభాళించుకోగలరని నరీందర్ కౌర్ నమ్ముతారు. కొన్ని గంటలు అభ్యసన కోసం కేటాయించగలిగి, గురుద్వారాలలో పాడేందుకు ఆసక్తి కలిగిన మహిళల్ని పోగేసి ఈమె, 2012లో గుర్బనీ విర్సాసంభల్ సత్సంగ్ జత్థాను ప్రారంభించారు. “వారు పిల్లల్ని, యింటినీ కూడా చూసుకోగలుగుతారు. ఒక సింగ్ (సిక్కు పురుషుడు) చేసే సేవ కన్నా ఈ మహిళలు చేసే సేవ రెట్టింపు,” అంటారామె.

సిక్కు మైనారిటీ కళాశాలల్లోని ధర్మజ్ఞాన సమాజాలు (డివినిటీ సొసైటీలు), సిక్కు విద్యార్థులు గుర్మత్ సంగీతంలో శిక్షణ పొందేందుకు తోడ్పడుతున్నాయి. ఇప్పుడు కిర్పా కౌర్‌గా పేరు మార్చుకున్న కాజల్ చావ్లా (24), 2018లో ఢిల్లీ విశ్వ విద్యాలయంలోని గురుగోవింద్ సింగ్ కళాశాల నుంచి ఆర్థికశాస్త్రంలో ఆనర్స్ పట్టా పొందింది. చదువుకునే రోజుల్లో ఈమె, కళాశాల ధర్మజ్ఞాన సమాజమైన విస్మాద్‌లో చురుకైన సభ్యురాలిగా ఉండేది. “వివిధ రకాల నేపథ్యాల నుంచి వచ్చే మా సభ్యులను కీర్తనలు, కవిత్వం, ఉపన్యాస పోటీల కోసం తీర్చిదిద్దేవారు. కళాశాలల్లో జరిగే ఉత్సవాలు మమ్మల్ని ఈ పోటీలకోసం తయారుచేసి మాలో ఆత్మవిశ్వాసం నింపుతాయి,” అంటుందీమె.

సుఖ్‌దీప్ కౌర్ (25) కథావాచక్ (సిక్కుల చారిత్రక విషయాలను వల్లించేవారు) కావాలనుకుంటున్నారు. ఫోటో సౌజన్యం: సుఖ్‌దీప్ కౌర్. కుడి: ఫరీదీబాద్‌లోని తన అకాడెమీలో బోధిస్తోన్న సిమర్‌జీత్ కౌర్. ఫోటో సౌజన్యం: సిమర్‌జీత్ కౌర్. కింద: హజూర్ సాహెబ్ యాత్రలో ప్రదర్శననిస్తోన్న నరీందర్ కౌర్ బృందం. ఫోటో సౌజన్యం: నరీందర్ కౌర్

“జో జ్యాదా రియాజ్ కరేగా వో రాజ్ కరేగా (ఎవరు ఎక్కువ అభ్యాసం చేస్తారో వారే వేదికపై రాజ్యమేలుతారు)”, అంటారు ఢిల్లీ విశ్వవిద్యాలయం లోని ఎస్‌జిబిటి ఖల్సా కళాశాల ధర్మజ్ఞాన సమాజంలో తబలా వాయించే 24 యేళ్ల భక్షంద్ సింగ్. యిక్కడి విద్యార్థులు గురుద్వారాలలో ప్రదర్శనలివ్వడంతో పాటు ఢిల్లీలో జరిగే యితర వేడుకలలో కూడా ప్రదర్శనలిస్తారు. యితర రాష్ట్రాల్లోకూడా పర్యటిస్తారు.

అయితే ఈ యువ సిక్కుల ఉత్సాహం వారికి మెరుగైన పరిస్థితులకూ, గుర్తింపుకూ దారితీయడం లేదు. “చాలామంది మహిళలు గురుద్వారాలలో కీర్తనలు పాడుతున్నప్పటికీ, ఒక్క మహిళ కూడా రాగీగానో, లేదా గ్రంథీగానో నియమింపబడటాన్ని నేను చూడలేదు,” అంటారు 54 యేళ్ల చమన్ సింగ్. ఈయన ఢిల్లీ సిక్కు గురుద్వారా నిర్వహణ కమిటీ (డిఎస్‌జిఎమ్‌సి)లో సభ్యునిగా పనిచేశారు. మహిళలను లెక్కలు చూసే పని, గుమాస్తా పని లేదా లంగర్‌లో వంట చేసే పనికి మాత్రమే నియమిస్తారని అంటారీయన. కీర్తన్‌కారులకు నెలకు రూ. 9,000 నుంచి 16,000 వేతనంగా లభిస్తోంది.

“అధికారం గురుద్వారాలను నిర్వహించే కమిటీల చేతిలోనే ఉంటుంది. ఒక గురుపూరబ్ (పండుగ) లేదా ఒక సమాగమ్ (ప్రయివేటు మతవేడుక)ను వారు నిర్వహించేటపుడు యువ విద్యార్థులకు, మహిళలకు ప్రదర్శన యిచ్చే అవకాశం యిచ్చి ప్రోత్సహించకుండా, పేరుపొందిన రాగీలను మాత్రమే ఎందుకు తీసుకుంటారు?” అనడుగుతారు ఢిల్లీకి చెందిన పరమ్‌ప్రీత్ కౌర్..

పరమ్‌ప్రీత్ కౌర్ (32) హిందుస్తానీ సంగీతంలో శిక్షణ పొందడంతోపాటు పటియాలాలోని పంజాబి విశ్వవిద్యాలయం నుంచి గుర్మత్ సంగీతంలో ఎం.ఎ పట్టా పొందారు. యితర యువతుల్లానే ఈమె స్వరానికి కూడా నెమ్మదిగా గుర్తింపు లభిస్తోంది. యిదంతా చూస్తోంటే మినహాయింపుల్లేకుండా అన్ని గురుద్వారాల్లోనూ, ప్రార్థనా స్థలాల్లోనూ మహిళల స్వరం ప్రతిధ్వనించేందుకు ఎంతో కాలం పట్టేలా లేదు.

ਭੰਡਹੁ ਹੀ ਭੰਡੁ ਊਪਜੈ ਭੰਡੈ ਬਾਝੁ ਨ ਕੋਇ ॥

ਨਾਨਕ ਭੰਡੈ ਬਾਹਰਾ ਏਕੋ ਸਚਾ ਸੋਇ ॥

ఒక స్త్రీ నుంచి మరొక స్త్రీ జన్మిస్తుంది

స్త్రీ లేకుంటే ప్రపంచంలో ఎవరూ ఉండరు

ఈ కవిత గురు గ్రంథ్ సాహిబ్‌లోని మహ్లా-1లోనిది, ఆసా రాగం.

PARI హోమ్ పేజీకి తిరిగి వెళ్ళేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

Editor's note

హర్మన్ ఖురానా ముంబైలోని సోఫియా మహిళా కళాశాల నుంచి సోషల్ కమ్యూనికేషన్స్ మీడియాలో యిటీవలే పట్టభద్రులయ్యారు. సిక్కు మత సంస్థల్లో మహిళల పాత్ర పై పరిశోధించేందుకు ఈ ప్రాజెక్టును ఈమె ఒక సాధనంగా చూ స్తున్నారు. ఈమె మాటల్లో: "సమసమాజ పునాదులపై నిర్మింపబడ్డ సంస్థల్లో లింగవివక్షత ఎలా చొరబడుతోందన్న సూక్ష్మమైన అవగాహన పొందేందుకు ఈ రిపోర్టింగ్ అనుభవం నాకు సహాయపడింది. జర్నలిజం మరియు ఫిల్మ్ మేకింగ్ రెండూ కలిసిన కూడలిలో పనిచేయడాన్ని నేను ఆస్వాదించాను. కెమెరాపర్సన్‌గా, రిపోర్టరుగా ఈ విషయం పట్ల బలమైన భావాలు కలిగిన మహిళలతో హృదయగతమైన సంభాషణలు జరిపాను. వారి నమ్మకాన్నే నేను ముందుకు తీసుకొచ్చాను. కె. నవీన్‌కుమార్, ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో సెరికల్చర్ అధికారిగా పనిచేస్తున్నారు. తెలుగు భాషకు చెందిన ఔత్సాహిక కవి, అనువాదకులు