ఒక బుట్టను అల్లడానికి అజిత(48)కు కావాల్సింది కేవలం ఒక కత్తి మాత్రమే. ముందుగా వెదురు కాడలు కొన్నింటిని తీసుకుని, వాటిని ఒకదానికొకటి లంబకోణంలో ఉంచి, వాటి గుండా ఒక కాడను దూర్చుతూ అల్లుతారు. అలా అల్లుతూ ఏర్పడే వృత్తాన్ని విస్తరిస్తూ వచ్చి, తాను చేయబోయే వస్తువుకు ఉండాల్సిన వ్యాసం మేరకు వచ్చే దాకా ఆమె అల్లుతారు.

“16 ఏళ్లప్పుడు [ఈ కళను] నేర్చుకోవడం మొదలుపెట్టాను.” అని అజిత చెప్పారు. రైతు కూలీ అయిన ఆమె తండ్రి ఏకైక సంపాదనతో ఇల్లు గడవడం కష్టమవడంతో 10వ తరగతి తర్వాత ఆమె స్కూలు మానేశారు. వీరి కుటుంబం త్రిస్సూర్ జిల్లా చలకుడి బ్లాక్‌లోని కుట్టిచిర గ్రామంలో నివసించేzవారు.

ఒక బుట్టను అల్లడానికి అజిత (48)కు కావాల్సింది కేవలం ఒక కత్తి మాత్రమే. ఫోటో తీసినవారు డాన్ ఫిలిప్

ఇప్పుడు అజిత తన భర్త సాయంతో పలు రకాల వెదురు ఉత్పత్తులను తయారు చేస్తారు. వాటిలో ల్యాంప్ షేడ్‌లు, పెన్ స్టాండ్‌లు, వెదురుతో చేసిన పువ్వులను గాజు సీసాలలో పెట్టి దాని చుట్టూ వెదురుతో అల్లిక వేసిన ఉత్పత్తులు- వీటితో పాటు పలు సైజులు షేపుల్లో ఉండే విసనకర్రలు, బుట్టలు ఉంటాయి.

“ఒక బుట్టను తయారు చేయడానికి దాదాపు ఒకటిన్నర రోజులు పడుతుంది. ముందుగా దానిని తయారు చేయడానికి ఒక రోజు పడుతుంది, ఆ తర్వాత దాని ఉపరితలాన్ని నున్నగా మార్చడానికి దాని మీద ఉండే సన్నని వెదురు నూగును పీకడానికి సగం రోజు పడుతుంది. ఈ వెదురు నూగును ఎంతగా తీసివేస్తే, అది అంతగా మెరుస్తుంది,” అని ఆమె వివరించారు. ఒక ల్యాంప్ షేడ్‌ను తయారు చేయడానికి రెండు రోజులు పడుతుంది. మరో వైపు ఒకే రోజులో 8 – 10 వెదురు పువ్వులను లేదా 5 పెన్ స్టాండ్‌లను తయారు చేయవచ్చు. ఏదైనా ఒక సీసా చుట్టూ వెదురును అల్లడమనేది ఎంతో సునిశితంగా చేయాల్సిన పని కాబట్టి అందుకు దాదాపు రెండు రోజులు పడుతుంది.

ఆమె చుట్టూ పలు వెదురు ఉత్పత్తులు మెరుస్తూ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. “వెదురు ఎంతగా ఎండిందనే దానిని బట్టి దానికి మామూలుగానే కాస్తంత మెరుపు ఉంటుంది. ఎంత ఎండితే అంత మంచిది,” అని ఆమె చెప్పారు. అజిత వార్నిష్‌ను కొద్దిగా మాత్రమే ఉపయోగిస్తారు ఎందుకంటే అది వాడితే కాలక్రమేణా వెదురు పాడవుతుందని ఆమె భావిస్తారు.

ఆమె ఇంటికి సుమారు పది కిలోమీటర్ల దూరంలోని చలకుడిలో బాంబూ కార్పొరేషన్ డిపోలో వెదురు లభ్యమవుతుంది. నెలకొకసారి అజిత అక్కడికెళ్లి వెదురును కొని తెచ్చుకుంటారు లేదా ఆ డిపో సిబ్బందే ఇటువైపుగా వస్తున్నప్పుడు వెదురును ఇక్కడికి తెచ్చిస్తారు. ఒక్కో కాడ దాదాపు 10 మీటర్ల పొడవు ఉంటుంది, అలాంటి 100 కాడలను ఆమె ఒక్కొక్కటి దాదాపు రూ. 30 రూపాయలకు కొంటారు. ఆ కాడలను డిపో వద్ద నుండి ఆమె ఇంటికి డెలివరీ చేసే సిబ్బందే, వాటిని స్టోరేజ్ షెడ్ వరకు మోసుకుని వెళ్లడంలో సాయపడతారు. ఆ షెడ్‌లో పెడితేనే అవి వర్షం బారిన పడి పాడవకుండా ఉంటాయి.

2015లో అజిత ‘శ్రీదీపం హ్యాండీక్రాఫ్ట్స్’ అనే పేరుతో తన కంపెనీని నమోదు చేసుకున్నారు. తాము తయారు చేసే వెదురు ఉత్పత్తులను డెలివరీ చేయడంలో ఆమె భర్త, కుమారుడు (స్కూటర్ మెకానిక్) ఆమెకు సహాయం చేస్తారు. ఆమె కుమార్తె వేరే చోట పని చేస్తోంది, అయినా వీలు దొరికినప్పుడల్లా ఈ పనిలో సాయపడుతుంది.

“కొవిడ్ మహారోగం వల్ల వెదురు వ్యాపారం మీద ఆధారపడే మా జీవితాలు భారీగా దెబ్బతిన్నాయి. వెదురు ఎగ్జిబిషన్ల వల్ల, అలాగే ఫంక్షన్లకు, హోటళ్లకు సరఫరా చేయడం వల్లే మాకు ప్రధానంగా ఆదాయం సమకూరేది,” అని అజిత చెప్పారు. కేరళకు చెందిన ‘మనోరమ ఫియెస్టా’తో పాటు బెంబూ మిషన్ నిర్వహించే వార్షిక బాంబూ ఫెస్టివల్ వల్ల క్రమం తప్పకుండా రాష్ట్రవ్యాప్తంగా అమ్మకాలు జరిగేవి. అయితే, 2020లో లాక్‌డౌన్‌లను విధించడంతో అవి కూడా రద్దు అయ్యాయి. “[కొవిడ్ మహారోగానికి ముందు] నేను ప్రతి నెలా రూ. 30 వేల నుండి 35 వేల వరకు లాభం సంపాదించేదానిని; ఇప్పుడు దాంతో పోలిస్తే 20-30% తక్కువ సంపాదించాల్సి వస్తోంది,” అని ఆమె చెప్పారు.

అజిత సొంత కంపెనీని స్థాపించే ముందు 20 ఏళ్ల పాటు చలకుడికి చెందిన ‘సెరాఫిక్ హ్యాండీక్రాఫ్ట్స్’ అనే ఒక కో-ఆపరేటివ్ సొసైటీలో పనిచేశారు. అక్కడ బుట్టలు, ట్రేలు, ల్యాంప్ షేడ్‌ల వంటి వెదురు ఉత్పత్తులను తయారు చేస్తారు.

ఇటీవలి కాలంలో ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లెన్నో పుట్టుకొచ్చినా, అజితకు వాటి మీద అంతగా నమ్మకం లేదు ఎందుకంటే అవి తన ఉత్పత్తులను సరిగ్గా హ్యాండిల్ చేయవని ఆమె భావిస్తున్నారు. “నేను తయారు చేసే ఉత్పత్తులు చాలా సన్నగా, పెళుసుగా ఉంటాయి,” అని ఆమె చెప్పారు. సన్నగా పొడవుగా ఉన్న ఒక వెదురు కాడను ఆమె తన చేతులతో వంచి, అది ఎంత పెళుసుగా ఉంటుందో చూపించారు. “కింది భాగంలో గట్టిగా చుట్టితే బాగా బలపడుతుంది, అయినప్పటికీ దానిని సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే మాత్రం వంగిపోతుంది,” అని ఆమె వివరించారు. “ఒక పెద్ద కో-ఆపరేటివ్ సొసైటీ వద్ద ఉండే ఆర్థిక వనరులు, ప్రోద్బలం ఏవీ నా వద్ద లేవు. ఏదైనా ఉత్పత్తి డ్యామేజీకి గురైతే దాని వల్ల వచ్చే నష్టం నా ఆదాయంపై భారీగా పడుతుంది కాబట్టి నా ఉత్పత్తులు డ్యామేజీకి గురయ్యే రిస్క్ నేను తీసుకోలేను,” అని ఆమె చెప్పారు.

తాను తయారు చేసిన పలు ల్యాంప్ షేడ్‌లను, బుట్టలను చూస్తూ “ఈ పని చేసేటప్పుడు, వేరే పనేదైనా చేస్తే ఇంకా ఎక్కువ సంపాదించుకోవచ్చనే ఆలోచన నాకు రాదు. ఈ పని పట్ల, ఈ కళ పట్ల నాకుండే ప్రేమతో, అంకితభావంతో చేస్తాను” అని అజిత చెప్పారు.

‘లాక్‌డౌన్‌లో జీవనగాధలు’ అనే కథనాల శ్రేణిలో భాగంగా ఈ వార్తా కథనం అందించబడుతోంది. ఇందుకు సహకారం అందించినందుకు గాను ముంబైకి చెందిన సెయింట్ జేవియర్స్ కాలేజ్ (అటానమస్)లో ప్రొఫెసర్లుగా సేవలందిస్తోన్న అక్షర పాఠక్-జాదవ్ మరియు పెర్రీ సుబ్రమణియంలకు PARI ఎడ్యుకేషన్ బృందం కృతజ్ఞతలు తెలుపుతోంది.

Editor's note

డాన్ ఫిలిప్ ముంబైకి చెందిన సెయింట్ జేవియర్స్ కాలేజ్ (అటానమస్)లో మాస్ కమ్యూనికేషన్ మరియు జర్నలిజం కోర్సులో రెండవ సంవత్సరంలో చదువుతున్నారు. ‘లాక్‌డౌన్‌లో జీవనగాధలు’ అనే కథనాల శ్రేణిని అందజేసేందుకు గాను PARI ఎడ్యుకేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన అతని కాలేజీ కోర్సులో భాగంగా కేరళ రాష్ట్రానికి చెందిన వెదురు హస్తకళా కార్మికుల జీవితాలపై పడిన ప్రభావాన్ని అధ్యయనం చేస్తున్నారు. “PARIతో సంయుక్తంగా చేస్తోన్న ఈ ప్రాజెక్ట్ వల్ల నాకు చిన్న స్థాయి పరిశ్రమల గురించి, ఈ వృత్తులలో కొనసాగే ప్రజలు కొవిడ్ మహమ్మారి వల్ల ఎదుర్కొన్న ఆటుపోట్ల గురించి లోతుగా అర్థమైంది. అజిత కథనాన్ని రాసే క్రమంలో విలేకరులపై నా గౌరవం మరింత పెరిగింది. ఎందుకంటే, అంతటి క్లిష్టమైన పనిని వారు ఎంతో సమర్థవంతంగా చేయగలరు."

అనువాదం : శ్రీ రఘునాథ్ జోషి

శ్రీ రఘునాథ్ జోషి, ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ పట్టా పొందిన తర్వాత తెలుగు భాష మీదున్న మక్కువతో తన కెరీర్ పంథా మార్చుకున్నారు. ప్రస్తుతం, నోయిడాకు చెందిన ఒక లోకలైజేషన్ సంస్థలో తెలుగు-ల్యాంగ్వేజ్ లీడ్‌గా రిమోట్‌గా సేవలందిస్తున్నారు.